గృహానికి రంగుల ఎంపికలో వాస్తు


వాస్తు ప్రకారం గృహం నిర్మించిన తర్వాత ఆ గృహానికి అందాన్ని, ఆకర్షణను తెచ్చే రంగుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తు ప్రకారం కొన్ని రంగులు ఇంటికి ఆకర్షణ, సుఖ సంతోషాలను తీసుకువస్తే మరికొన్ని రంగులు వేసిన ఇళ్లు సమస్యల నిలయాలుగా మారుతాయని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు. అందువల్ల ఇంటికి వేసే రంగుల విషయంలో వాస్తు ప్రకారం నడుచుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి రంగుల్ని ఎంచుకోవాలన్న విషయం సందేహాలు తలెత్తడం సాధారణం. అయితే రంగుల ఎంపికలో వాస్తుశాస్త్రం కొన్ని విషయాలను మనకు సూచిస్తోంది. దానిప్రకారం కొన్ని రకాల రంగులను ఉపయోగించడం ద్వారా గృహంలో నివశించేవారికి వృద్ధి, పేరు ప్రతిష్టలు అర్జనలో రంగులు కీలక పాత్ర వహిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. ముఖ్యంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగులు వాస్తు ప్రకారం గృహ సంక్షేమంలో ప్రధానపాత్ర వహిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. 



వ్యాపార కార్యకలాపాల వృద్ధిలో నలుపు రంగుతోను, పేరు ప్రఖ్యాతులకు ఎరుపు రంగుతోను అవినాభావ సంభంధం ఉందని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక గృహానికి లేదా వాణిజ్య సముదాయానికి వాడబడే రంగులను బట్టే మనలో ఉత్సాహం, శక్తి పెరుగుతుందని, అందువల్ల గృహానికి అనుకూలమైన రంగులు వాడడం కూడా చాలా అవసరమని వాస్తు చెబుతోంది. దీని ప్రకారం రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్‌లో సదరు గృహంలో నివశించేవారు అన్ని రకాల సుఖఃశాంతులతో జీవిస్తారని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.


మనుషుల ప్రవర్తన, ఆలోచన, భావోద్వేగాలపై రంగుల ప్రభావం అధికంగా ఉంటుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటుంది. గృహానికి మనం వాడే రంగులను బట్టి శుభ, అశుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 

ఇందులో భాగంగా... ఫెంగ్‌షుయ్ ప్రకారం రంగులను ఎలా వాడాలనే అంశాలను పరిశీలిస్తే... అన్ని రంగుల్లోనూ కొట్టొచ్చేలా కనిపించేది ఎరుపు. దీనిని గృహాలకు మితంగా వాడితే మంచిది. ఎరుపు రంగును పడక గదులకు పూర్తిగా ఉపయోగించకూడదు. 

ఇక పసుపు రంగును మేధస్సుకు, పరిణతికి చిహ్నంగా కొలుస్తారు. ఈ రంగును వంటగది, సిటింగ్ రూమ్‌లకు వాడితే శుభఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు. 

ఇదే విధంగా... గోధుమ రంగు విషయానికొస్తే... ఈ రంగును ఫెంగ్‌షుయ్ స్థిరత్వానికి ప్రతీకగా పేర్కొంటారు. అందుచేత గోధుమరంగు ప్లోరింగ్‌కే పరిమితం చేయాలి. 

ఇకపోతే.. బంగారు, వెండి రంగులు ధనం, సంపదను సూచిస్తాయి. అందుచేత ఈ రంగులను గృహంలోని దేవుడి గది, బంగారు ఆభరణాలు, నగదు భద్రపరచే అలమరాలకు ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అధికంగా సంచారంలేని విశాల గదులకు కూడా బంగారు, వెండి రంగులను ఉపయోగించవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అదేవిధంగా... బూడిద, తెలుపు రంగులు గృహంలో ఏ గదికైనా వాడుకోవచ్చు. నీలం, వంకాయ రంగులు విశ్రాంతికి సూచికలు. అందువల్ల బెడ్‌రూమ్, ఇతర విశ్రాంతి మందిరాల్లో కనిపించేలా వాడుకోవాలి. ఆకుపచ్చ రంగు వృద్దికి చిహ్నం. దీనిని బయటి గోడలకు ఉపయోగించుకోవచ్చు. గులాబీరంగు సిటింగ్ రూమ్‌లకు వేస్తే ఆ గృహంలో సకల సంపదలు వెల్లివిరుస్తాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. 
ఇదిలా ఉంటే.. నలుపు రంగు మాత్రమే జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందువల్ల దీనిని ఎవ్వరు సంచరించని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలి 

Popular Posts