జానపద గీతాలు(Telugu Folk Songs)

Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.

జానపదమనగా జనపదానికి సంబంధించినది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివశించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది.

పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసి మనల్ని ధన్యులని చేయ రాగిరేకుల పై భద్రపరిచినారు

1. కోలాటం పాట

రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు

సీతమ్మ గట్టించే కోలు సిరిపరినా సోల కోలు

సిరిపర్నసోలాలా కోలు సిత్తారీ ముగ్గు కోలు

సిత్తారి ముగ్గు పైనా కోలు రత్నాల కమ్మడీ కోలు

రత్నాల కమ్మడీ పైనా కోలు వాలు చిలకాలు కోలు

వాలు చిలుకలపినా కోలు వారిద్దరయ్యా కోలు

రామయ్యా సీతమ్మా కోలు జూదమాడంగా కోలు

ఆడుతాడుత వచ్చే కోలు అది మాయలేడి కోలు

మాయాలేడికైనా కోలు మడిమే లందమ్మూ కోలు

అటుజూడురామయ్య కోలు అటుజూడావయ్యా కోలు



2. మొక్కజొన్న తోటలో

సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ,

పంటబోది వరమడితో - పకపక నవ్వే వేళ,

సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ,

మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో,

మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య,

చీకటి మిణుగురు జోతుల - చిటిల చిల్లులడక మునే,

సుద్దులరాగాలు చెవుల - నిద్దరతీయక మునుపే,

ఆకాశపుటొడిని తోట - ఆవలింత గొనక మునే,

పొద్దువాలుగంటనే - పుంతదారి వెంటనే,

సద్దుమణగనిచ్చిరా - ముద్దులమామయ్య!

గొడ్డుగోద మళ్లేసే - కుర్రకుంకలకు గానీ,

కలుపుతీతలయి మళ్ళే - కన్నెపడుచులకు గానీ,

బుగ్గ మీస మెలివేసే - భూకామందుకు గానీ,

తోవకెదురు వస్తివా - దొంగచూపు చూస్తివా,

తంటా మన యిద్దరికీ - తప్పదు మామయ్య!!

కంచెమీద గుమ్మడిపువు - పొంచి పొంచి చూస్తాది;

విరబారిన జొన్న పొట్ట - వెకిలినవ్వు నవుతాది;

తమల తీగెలు కాళ్ళకు - తగిలి మొరాయిస్తాయి;

చెదిరిపోకు మామయా - బెదిరిపోకు మామయా

సదురుకొని నీ పదునుగుండె - సక్కని మామయ్య

పనలు కట్టి యెత్తి నన్ను - పలకరించ బోయినపుడు

చెరుకుతోట మలుపుకాడ - చిటిక వేసి నవ్వినపుడు,

మోట బావి వెనక నాతో - మోటసరస మాడినపుడు

కసిరితిట్టినాననీ, - విసిరికొట్టినాననీ,

చిన్నబోకు నలుగురిలో - సిగ్గది మామయ్య.


3. చల్ మోహనరంగా

నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు

ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా చల్ మోహనరంగా


నీకు నాకు జోడు కలసెను గదరా

మల్లె తోటలోన మంచినీళ్ళ బావికాడ

ఉంగరాలు మరచి వస్తిని కదరా || చల్ ||


కంటీకి కాటుకెట్టీ కడవా సంకాన బెట్టి

కంటి నీరు కడవ నింపితి గదరా || చల్ ||


గట్టుదాటి పుట్టదాటి - ఘనమైన అడవిదాటి

అన్నిదాటి అడవి బడితిమి గదరా || చల్ ||


నీకు నాకు జోడు అయితే - మల్లెపూలా తెప్పగట్టీ

తెప్పమీద తేలిపోదము పదరా || చల్ ||


అదిరా నీ గుండెలదరా - మధురా వెన్నెల రేయి

నిదరాకు రమ్మంటిని కదరా || చల్ ||


4. ఏడవకు ఏడవకు!

"ఏడవకు కుశలవుడ రామకుమార,

ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుందూరు;

ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు,

ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు;

పట్టు టంగీ గొనుచు పులిగోరు గొనుచు,

భూదేవి అమ్మమ్మ వెచ్చె నేడవకు;

రావిరేకలు గొనుచు రత్నాలు గొనుచు,

లక్ష్మన్న పినతండ్రి వచ్చె నేడవకు;

ఏడవకు కుశలవుడ రామకుమార,

ఏడిస్తే నిన్నెవ్వ రెత్తుకుందూరు".


5. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

అర్జునుడు తిన్న అరటిపండ్లరిగి

భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి

అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి

పామల్లెపాకి కుందల్లె కూర్చుండి

నందల్లె నడిచి గుఱ్ఱమంత పరుగు

ఏనుగంత సత్తువు ఉండేటట్లు

సాకుమా బిడ్డను సంజీవరాయ"

6. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్త||

కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న ఏదమ్మా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ

అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా
పచ్చిపాలమీద మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న ఉంటుందా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ

అత్త||

వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా
మినప సున్నుండలేమాయే కోడలా …
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ

ఇంటికి పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారె అత్తమ్మా
వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మా …
ఛీ పో… నీ జిమ్మడా…. ఉండు నీ పని చెబుతా…

కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ
పొమ్మని కాలంతా కుట్టిందీ తేలు
అయ్యో.. అబ్బా … అమ్మా … అయ్యో

ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది

ఆహ.. ఊహూ
అత్త||
ఆహ.. ఊహూ .. అహ …


7. బావా! బావా! పన్నీరు

"బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

మూడు గుద్దులు గుద్దేరు

మూలన మంచం వేసేరు

ముంతెడు గంజి యిచ్చేరు

బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు

వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు

చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు."

పల్లేరు తెప్పించి పక్క వేయండీ

నల్లేరు తెప్పించి నలిచి విడువండీ

నల్లేరు చేతాను నయము కాకుండీ

దూలగొండి తెచ్చి దులుపి పంపండి."


8. చీరల్ కావలెనా

"చీరెల్ కావలెనా రవికల్ కావలెనా

నీకేమి కావలెనే పొద్దుటూరి సంతలోనా

చీరల్ నా కొద్దురో రవికల్ నా కొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

డావుల్ కావలెనా ఆరం కావలెనా

నీకేం కావలెనే పులివెందుల సంతలోనా

డావుల్ నాకొద్దురో ఆరం నాకొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

కమ్మల్ కావలెనా కడియాల్ కావలెనా

నీకేమి కావలెనే దర్మారం సంతలోనా

కమ్మల్ నాకొద్దురా కడియాల్ నాకొద్దురా

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా"

9. గుత్తొంకాయ్ కూరోయ్ బావా!

గుత్తొంకాయ్ కూరోయ్ బావా!

కోరివండినానోయ్ బావా!

కూర లోపల నా వలపంతా

కూరి పెట్టినానోయ్ బావా

కోరికతో తినవోయ్ బావా!

తియ్యని పాయసమోయ్ బావా!

తీరుగ వండానోయ్ బావా!

పాయసమ్ములో నా ప్రేమనియేటి

పాలుబోసినానోయ్ బావా!

బాగని మెచ్చాలోయ్ బావా!

కమ్మని పూరీలోయ్ బావా!

కర కర వేచానోయ్ బావా!

కర కర వేగిన పూరీలతో నా

కాంక్ష వేసినానోయ్ బావా!

కనికరించి తినవోయ్ బావా!

వెన్నెల యిదిగోనోయ్ బావా!

కన్నుల కింపౌనోయ్ బావా!

వెన్నెలలో నా కన్నె వలపనే

వెన్న గలిపినానోయ్ బావా!

వేగముగా రావోయ్ బావా!

పువ్వుల సెజ్జిదిగో మల్లే

పువ్వులు బరిచిందోయ్ బావా!

పువ్వులలో నా యవ్వనమంతా

పొదివి పెట్టినానోయ్ బావా!

పదవోయ్ పవళింతాం బావా!
10. జుంకాలు కావలెనా

"జుంకాలు కావలెనా గంటీలు కావలెనా

మరిఏమికావలెనా మరదలు నరసమ్మ నీకు

జుంకాలు వలదురో గంటీలు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ

బాడీలుకావలెనా జాకెట్లుకావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు

బాడీలు వలదురో జాకెట్లు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ

సీరెలు కావలెనా లంగాలు కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు

సీరెలు వలదురో లంగాలు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ

సిలకలు కావలెనా కమ్మలు కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు

సిలకలు వద్దురో కమ్మలు వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ

అద్దం కావలెనా దువ్వెన కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు

అద్దం వద్దురో దువ్వెన వలదురో

నీవే కావాలిరో బలుగురు కొండయ్యబావ

పౌడరు కావలెనా దువ్వెన కావలెనా

మరిఏమికావలెనే మరదలు నరసమ్మ నీకు

పౌడరు వద్దురో దువ్వెన వలదురో

నీవేకావాలిరో బలుగురు కొండయ్యబావ".



ref:



http://www.janaganamana.net/onedefault.aspx?bid=118

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/august2009/janapadasamgeetam.html


Popular Posts